08 October 2024
Hyderabad
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘వేట్టయన్ ది హంటర్ సినిమాను నేను, ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీ మెయిన్ టైటిల్ ది హంటర్. అన్ని భాషల్లోనూ వేట్టయన్ ది హంటర్ అని రిలీజ్ చేస్తున్నారు. హంటర్ అనేదే ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్. ఈ చిత్రంలో రజినీకాంత్ గారు, అమితాబ్ గారు, ఫాహద్ గారు, రానా, మంజు వారియర్ ఇలా భారీ తారాగణం కనిపిస్తుంది. టి.జె.జ్ఞానవేల్ సెన్సిబుల్ డైరెక్టర్. ఇందులో రజినీకాంత్ కొత్తగా కనిపిస్తారని అనిరుధ్ కూడా చెబుతున్నారు. డబ్బింగ్ చిత్రాలంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు అన్ని చిత్రాలు అన్ని భాషల్లోకి వెళ్తోంది. మనం అన్ని భాషల చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నాం. అందరూ సినిమాలను థియేటర్‌లకు వచ్చి చూడాలనే అనుకుంటున్నాం. మన తెలుగు చిత్రాలు అయితే అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. బెంగాలీ వాళ్లు కూడా డబ్బింగ్ కావాలని అడుగుతున్నారు. ఇలా డబ్బింగ్ చిత్రాలు రావడం వల్ల లోకల్ టాలెంట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరికీ పరోక్షంగా పనులు కూడా దొరుకుతాయి. ఎక్కువ మంది జనాలు చూడాలనే మేకర్స్ మల్టీ స్టారర్లు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా చూడాలంటే చాలా మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ థియేటర్లో అందరం కలిసి చూస్తాం. ఆ ఫీలింగ్ ఓటీటీల్లో రాదు. సినిమా కల్చర్, థియేటర్ కల్చర్‌ను కాపాడాలి. వేట్టయన్ మూవీని థియేటర్లో చూడండి. అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘లైకా ప్రొడక్షన్స్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని మేం ముగ్గురం కలిసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో వేటగాడు అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే వాళ్లకి ఆల్రెడీ ఉంది. తమిళంలోనూ ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్స్ మాత్రమే పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోతోంది. సినిమా గ్లోబల్‌గా ఎదిగింది. వేరే భాషల్లో అనువాద టైటిల్స్ దొరికితే పెడుతున్నారు. లేదంటే ఒకే టైటిల్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఒకే టైటిల్‌తో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ టైటిల్ పెట్టినా కూడా సినిమా బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. సినిమాని సినిమాలా చూడండి. జై భీం వంటి అద్భుతమైన సినిమాను తీసిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తీశారు. దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. కుటుంబ సమేతంగా అందరూచూసి ఎంజాయ్ చేసేలాఉంటుంది’ అని అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘సినిమా అనే దానికి భాష లేదు.. హద్దుల్లేవు. కథను బట్టి ఆ చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజినీకాంత్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రం భారీ తారాగణంతో వస్తోంది. రజినీకాంత్ గారు, అమితాబ్ గారు, ఫాహద్ గారు, మంజు వారియర్ గారు.. ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా ఉంటాయి. రియలిస్టిక్ మూవీలో ఇన్ని మంచి పాత్రలు ఉండటం చాలా అరుదు. రజినీకాంత్ గారి ముందు నిలబడి డైలాగ్ చెప్పడం, నటించే ఛాన్స్ రావడం చాలా లక్కీ. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
|