07 October 2024
Hyderabad
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఫాదర్- సన్ ఎమోషన్ యూనివర్సల్ కదా.. ఈ సినిమాలో ఆ ఎమోషన్ చూపించడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
- మా నాన్న సూపర్ హీరో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా సెట్ అయింది. ఇద్దరు తండ్రులు- ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన లో చాలా కొత్త సిచువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయ్యాయి. ఫాదర్ సన్ ఎమోషన్ ఆల్రెడీ ఉంది. అది జనాలకి గుర్తు చేస్తే చాలు. నాన్నని ప్రేమిస్తున్న కథ చెబుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ లోనే ఎస్టాబ్లిష్ అవుతాయి. దీన్ని ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను.
ట్రైలర్ లోనే దాదాపుగా కథని రివిల్ చేయడం గురించి ?
-ఇది థ్రిల్లర్ కాదు. తొలి రెండు సీన్స్ లోనే కథ ఏమిటనేది ఆడియన్స్ కి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆ సిచువేషన్స్ ఎప్పుడు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ రిలేషన్స్ మీద ఉన్న పాయింట్ ఇది. ఇది ఎలాంటి సినిమా, ఆడియన్స్ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చు అనేది క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాం.
ఇందులో రియల్ లైఫ్ ని గుర్తు తెచ్చిన మూమెంట్స్ ఏమిటి ?
-ఇందులో దాదాపు అన్ని సీన్స్ నన్ను ఇమోట్ చేశాయి. ఇందులో హీరో తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఈ ఎమోషన్ నేచురల్ గా నా నుంచి వచ్చింది. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. ఇందులో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్ లు చేయకూడదని అనుకున్నాం. కెమరా మూమెంట్స్ కూడా చాలా సహజంగా వుంటాయి. నేచురల్ గా చేయడానికి ప్రయత్నించాం. మీరు గమనిస్తే.. గత పెర్ఫార్మెన్స్ లకి, ఈ సినిమాకి ఎక్కడా రిఫరెన్స్ పాయింట్ వుండదు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చేసిన సినిమా ఇది.
హరోం హర లాంటి యాక్షన్ సినిమా తర్వాత ఇలాంటి సెంటిమెంట్ వున్న చేయడానికి కారణం?
-ఫలానాదే చేయాలని ప్లాన్డ్ గా అనుకోను. యాక్టర్ గా అన్నీ జోనర్ సినిమాలు చేయాలి. కంటిన్యూగా యాక్షన్ సినిమాలే చేస్తే గనుక కథలు కూడా తక్కువైపోతాయి. రకరకాల కథలు చేయాలి. అప్పుడే రైటర్స్, డైరెక్టర్స్ కి కూడా ఏదైనా చేయగలననే నమ్మకం వస్తుంది. నాకు వచ్చిన కథల్లో ఏది బావుంటే అది చేస్తాను. అలా వచ్చిన కథే మా నాన్న సూపర్ హీరో.
'మా నాన్న సూపర్ హీరో' ఎలా స్టార్ట్ అయ్యింది?
-అభిలాష్ చేసిన 'లూజర్' సిరిస్ చూశాను. అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఫాదర్ ఎమోషన్ పై చాలా సినిమాలు వచ్చాయి. అయితే కంప్లీట్ ఫాదర్ ఎమోషన్ వున్న సినిమాలు రేర్. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతముందు ఎప్పుడూ రాలేదు.
-ఫాదర్ పై ప్రేమని 'యానిమల్'లో అగ్రెసివ్ అండ్ బోల్డ్ గా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లా చూపించారు. అది జనాలకి నచ్చింది. మా నాన్న సూపర్ హీరోలో నాన్నమీద వున్న ప్రేమని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. చాలా రియల్ గా రిలేటబుల్ గా వుంటుంది. కొన్ని ఇంటెన్స్ సీన్స్ వుంటాయి. అలాగే సినిమా చూస్తున్నప్పుడు త్రూ అవుట్ ఆడియన్స్ ఫేస్ లో ఓ స్మైల్ వుంటుంది.
-ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫిల్మ్. రేర్ స్టొరీ. డెఫినెట్ గా ఆడియన్స్ కి నచ్చుతుంది. నా కెరీర్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ సినిమా ఇది. ఫస్ట్ డే నుంచే యునానిమస్ గా ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది.
నిర్మాతల గురించి ?
యూవీ క్రియేషన్స్ నా ఫ్రెండ్స్. విక్కీ, వంశీ, సునీల్ మేమంతా కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఆర్య నుంచి నాలుగైదు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. తర్వాత వాళ్లు కంటిన్యూ చేశారు. క్వాలిటీ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చేసే ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఈ బ్యానర్ లో డైరెక్టర్స్ హిట్ కొట్టకపోతే వేరే బ్యానర్ లో హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. ఇంత ఫ్రీడమ్ ఎక్కడా దొరకదు. మేమంతా కలిసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ళ బ్యానర్ లోనే నేను హీరోగా సినిమా చేయడం.. నైస్ ఫీలింగ్. అలాగే ఎలాగైనా హిట్ కొట్టాలనే రెస్పాన్సిబిలిటీ ఉంది. 100% హిట్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది.
మహేష్ బాబు గారు ట్రైలర్ రిలీజ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏంటి ?
-మహేష్ గారికి మొదట రఫ్ కట్ పంపించాను. చూసి లుకింగ్ గుడ్ అన్నారు. ఫైనల్ ట్రైలర్ పంపించిన తర్వాత.. చూసి చాలా అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచ్చింగ్ అన్నారు. లాస్ట్ లో వచ్చే 'మహేష్ బాబు పేరు' ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా ఫన్నీగా వుందని అన్నారు. బేసిక్ గా అయితే ఆయన ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. కానీ దీని గురించి చాలా ఎక్స్ ప్రెసీవ్ గా మాట్లాడారు.
సాయి చంద్, సాయాజీ షిండే గారి వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది.
-ఇద్దరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సాయాజీ షిండే గారు ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఒక ఫ్రెష్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఆయన క్యారెక్టర్ రిఫ్రెష్మెంట్. ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్. సాయి చందు గారు ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఎమోషనల్ క్యారెక్టర్స్ ని చాలా అద్భుతంగా చేస్తారు. ఇందులో ఆయన క్యారెక్టర్ కి ఒక ఫన్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.
సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూశాక మీరు పెట్టుకున్న హోప్ ని డైరెక్టర్ అభిలాష్ నిలబెట్టుకున్నాడని అనిపించిందా?
-నిలబెట్టుకున్నాడు. అవుట్ పుట్ చూడకముందే తనపై నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వుంది. తను ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాలు తీస్తాడు. ఫిల్మ్ స్కూల్ నుంచి నేర్చుకొని వచ్చాడు. చాలా అర్గనైజ్ గా వుంటాడు. చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. తను క్రియేట్ చేసిన ఎట్మాస్పియర్ పెర్ఫార్మెన్స్ కి బాగా కుదిరింది.
జైక్రిష్ మ్యూజిక్ గురించి ?
చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తను చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దానికి మించిన పేరు ఈ సినిమాతో వస్తుంది. పాటలు, బీజీఎం అన్నిటికి మంచి పేరు వస్తుంది.
లవ్ ట్రాక్ ఎలా వుంటుంది ?
-లవ్ ట్రాక్ వుంటుంది కానీ చాలా తక్కువ. బేసిగ్గా హీరో, హీరోయిన్ మధ్య జరిగే లవ్ స్టోరీ లో పేరెంట్స్ పార్ట్ సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో మాత్రం ఫాదర్ సన్ మధ్య జరిగే లవ్ స్టోరీ లో హీరోయిన్ సపోర్టివ్ గా ఉంటుంది.
మీ నాన్నగారు స్ట్రిక్ట్ ఫాదరా ?
నాన్నగారు స్ట్రిక్ట్ కాదు. చాలా క్రమశిక్షణ గల మనిషి. ఆయన క్రమశిక్షణ మాకు స్ఫూర్తినిచ్చింది. ఆయనకి ఎప్పుడు కోపం రాదు. ఆయన లైఫ్ స్టైల్ నాకు, అక్కకి ఒక ఇన్స్పిరేషన్.
కొత్తగా చేయబోతున్న సినిమాలు గురించి?
-'జటాధరా' కాన్సెప్ట్ పరంగా వెరీ బిగ్ స్కేల్ మూవీ. ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా వుంటుంది.
|