|

02 May 2015
Hyderabad
సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖలతో పాటు మరో శాఖ ప్రారంభం అయ్యింది. అదే తెలంగాణ సినీ టీవీ బౌన్సర్ అండ్ బాడీ బిల్డర్స్ అసోషియేషన్. ‘మే’ డే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి..అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు ఎన్ శంకర్, శివాజీరాజా, కాదంబరి కిరణ్, వెంకట్ యాదవ్, బౌన్సర్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. నర్సింగ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్‌కి చెందిన సభ్యులను చిన్న శ్రీశైలం యాదవ్ సన్మానించారు.
ఈ సందర్భముగా చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. ‘సినీ కార్మికుల కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ అసోసియేషన్ ‘మే’ డే రోజున ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. వచ్చే ‘మే’ డే నాటికి సినీ కార్మికులతో పాటు బౌన్సర్స్‌కు కూడా గృహవసతి కల్పించాలని మంత్రివర్యులను కోరుకుంటున్నాను..’ అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బౌన్సర్స్‌కు గృహవసతితో పాటు, ఇన్సూరెన్స్ కూడా ఇప్పించవలసిందిగా మంత్రిగారిని కోరుతున్నాను..’ అన్నారు.
లోగో ఆవిష్కరణ అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఎంతో మంది సెలబ్రిటీలకు రక్షణగా నిలిచే బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సోదరుడు చిన్న శ్రీశైలం యాదవ్‌ను అభినందిస్తున్నాను. వారి కోసం ఏర్పాటు చేసుకోనున్న భవన సముదాయానికి నా వంతు సహాయంగా 5 లక్షల రూపాయలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా సినీ, టీవీకి సంబంధించి ప్రతి కార్మికుడికి పట్టా ఇళ్లు ఇప్పించడానికి ప్రభుత్వపరంగా కృషి చేస్తాను. సోదరుడు శ్రీశైలం యాదవ్ కోరిన విధంగా చిత్రపురి కాలనీకి సమీపంలో గల పది ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించి అక్కడే వారికి వసతి సదుపాయం కల్పిస్తాను. అలాగే చిత్రపురికాలనీలో అనేక అవకతవకలు జరిగాయని ఇప్పటికే నా దృష్టికి వచ్చింది. ఆ సంగతి కూడా చూస్తాను. చిత్ర పరిశ్రమ కొద్దిమంది చేతిలో నలిగిపోతుంది. ఎవరెవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఎంతమంది చేతిలో ధియేటర్లు ఉన్నాయి..వంటి అన్ని విషయాలు నాకు తెలుసు. దీనిపై త్వరలోనే దృష్టిపెడతాం..’ అని అన్నారు.





|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|